Bandi sanjay: కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కోటి యాభై లక్షల రూపాయల సిఎస్సార్ నిధులతో కొనుగోలు చేసిన అత్యాధునిక వైద్య పరికరాలను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వ ఆసుపత్రుల బలోపేతంపై పలు ముఖ్య వ్యాఖ్యలు చేశారు.
బండి సంజయ్ మాట్లాడుతూ పేద ప్రజలు అత్యవసర చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రులను నమ్మి వస్తారని, ఆ నమ్మకాన్ని మరింత పెంపొందించే దిశగా కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ అవకాశాలను సక్రమంగా వినియోగించుకోవడంలో విఫలమైందని ఆయన విమర్శించారు.
ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రుల్లో సౌకర్యాల కొరత కారణంగా ప్రజల నమ్మకం తగ్గిపోతోందని, ఈ పరిస్థితిని మార్చడానికి కేంద్రం చర్యలు తీసుకుంటోందని ఆయన అన్నారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఇప్పటివరకు సిఎస్సార్ నిధుల ద్వారా ఐదు కోట్ల రూపాయలతో ఆధునిక పరికరాల కొనుగోలుకు సహకరించామని వివరించారు.
అలాగే ఆసుపత్రిలో పోస్టుమార్టం రూమ్, ఎక్స్–రే మిషన్‌తో పాటు అవసరమైన ఇతర పరికరాలను కూడా త్వరలో ఎంపీ నిధుల ద్వారా అందజేస్తామని హామీ ఇచ్చారు. పరికరాలు లేవనే పేరుతో పేద రోగులను కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేయొద్దని వైద్యులకు సూచించారు. సేవా దృక్పథంతో పనిచేస్తే ప్రజల్లో ప్రభుత్వ ఆసుపత్రులపై విశ్వాసం తిరిగి ఏర్పడుతుందని చెప్పారు.
ఇక రాష్ట్రంలో చెక్‌డ్యాంల నిర్మాణంలో భారీ అవినీతి జరిగిందని బండి సంజయ్ ఆరోపించారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు తీసుకుంటూ ప్రణాళిక లేకుండా చెక్‌డ్యాంలను నిర్మించిందని విమర్శించారు. బిఆర్ఎస్ ప్రభుత్వంలో పనిచేసిన కాంట్రాక్టర్లు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా కొనసాగుతున్నారని చెప్పారు. చెక్‌డ్యాంలపై విచారణ జరిపించి అవినీతి నిర్ధారించాలని డిమాండ్ చేశారు

