Bandi sanjay: తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ రాష్ట్ర ప్రజలకు నిరాశ కలిగించేలా ఉందని కేంద్ర సహాయ మంత్రి, బీజేపీ నేత బండి సంజయ్ విమర్శించారు. ప్రభుత్వ ఆరు గ్యారెంటీలపై ప్రజలు ఆశలు పెట్టుకున్నప్పటికీ, బడ్జెట్ ఆ ఆశలను వదులుకునేలా చేసిందని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాలు, అప్పులు, దోపిడీలలో గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మించిపోయిందని ఆరోపించారు.
ఈ బడ్జెట్ కేటాయింపులు, ఆచరణకు పొంతన లేకుండా ఉందని బండి సంజయ్ మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఎన్నో హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, కనీసం పది శాతం హామీలను కూడా అమలు చేయలేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం అసమర్థంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ, 2 లక్షల ఉద్యోగాల భర్తీ, రూ. 4 వేల నిరుద్యోగ భృతి లాంటి హామీలు పూర్తిగా మర్చిపోయారని అన్నారు. విద్య, వైద్య రంగాలకు తగినంత నిధులు కేటాయించలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉగాది పచ్చడిలా రాష్ట్ర బడ్జెట్: కూనంనేని సాంబశివరావు
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ఉగాది పచ్చడిలా ఉందని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు విమర్శించారు. రాష్ట్రం నుంచి కేంద్రానికి వాటా పంపిస్తూనే ఉన్నా, కేంద్రం నుంచి సరైన నిధులు రావడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
L
సుమారు రూ. 6 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్నప్పటికీ, హామీలను నెరవేర్చే పరిస్థితి కనపడడం లేదని కూనంనేని వ్యాఖ్యానించారు. ఖర్చు పెంచకుండా ఆదాయం వచ్చే కొత్త మార్గాలను అన్వేషించాలని సూచించారు. రాష్ట్ర జనాభాలో సగానికి పైగా ప్రజలకు ఈ బడ్జెట్ నుంచి లాభం లేకుండా పోయిందని విమర్శించారు.

