Butta Renuka Out: రాష్ట్రవ్యాప్తంగా 2024 ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయాన్ని చవి చూసింది. కేవలం 11 సీట్లతోనే సర్దుకుంది. దీంతో ఓడిన ప్రతి చోట కూడా ఓడిన అభ్యర్థులనే నియోజకవర్గ ఇంచార్జీలుగానియమించింది. అదే విధంగానే కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు సెగ్మెంట్‌కు ఇంచార్జిగా బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళ బుట్టారేణుక కొనసాగుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక మార్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇంచార్జి హోదాలో నిరసన కార్యక్రమాలు చేశారు. అయితే ఇప్పుడు బుట్టా రేణుకకు చెక్ పెట్టారు వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి. నియోజకవర్గ ఇంచార్జిగా మాజీ ఎమ్మెల్యే ఎర్రకోట చిన్న కేశవరెడ్డి మనవడు ఎర్రకోట రాజీవ్ రెడ్డికి బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది.
మొదటి నుంచి ఎమ్మిగనూరు వైసీపీలో కుమ్ములాటలు ఉన్నాయి. మాజీ ఎమ్మెల్యే ఎర్రకోట కేశవరెడ్డిని కాదని బీసీ వర్గానికి చెందిన చేనేత మహిళ అయిన బుట్ట రేణుకకు గత ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డి టికెట్ ఇచ్చారు. అప్పటినుంచి మాజీ ఎమ్మెల్యే ఎర్రకోట కేశవరెడ్డి బుట్టా రేణుకకు సహకరించట్లేదు. అందువల్లే ఆమె ఓడిపోయారని అప్పట్లో సెగ్మెంట్లో బాగా టాక్ నడిచింది. అంతేకాక పార్టీ కార్యక్రమాల్లో కూడా ఎక్కడా ఇద్దరూ ఒకే చోట పాల్గొన్న దాఖలాలు లేవు. దీంతో ఫ్యాన్ పార్టీలో ఉన్న కార్యకర్తలు ఎవరి దగ్గరికి వెళితే ఏ ముప్పు వాటిల్లుతుందో అని ఇద్దరికీ దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు బుట్టా రేణుక తన అనుచర వర్గంతో నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలోపే నియోజకవర్గ ఇంచార్జిగా ఉన్న బుట్టా రేణుకకు వైసీపీ అధిష్టానం చెక్ పెట్టింది. దీంతో బుట్టా రేణుక వర్గం అయోమయంలో పడింది.
Also Read: Babu London Tour Spl: బాబు పెట్టుబడుల వేట.. సతీమణికి అవార్డుల పంట!
ఎమ్మిగనూరు వైసీపీ ఇంచార్జ్ విషయంలో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్, సజ్జల రామకృష్ణారెడ్డిల సమక్షంలో బుట్టా రేణుక పంచాయతీ పెట్టారు. ఒకపక్క బుట్టా రేణుక భర్త నీలకంఠ, తనయుడు ప్రతుల్… మరోపక్క మాజీ ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి, ఆయన తనయుడు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి, మనవడు ఎర్రకోట రాజీవ్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్‌లో జగన్‌ను కలిసారు. నియోజకవర్గ ఇంచార్జ్ విషయంలో ఇరువర్గాల మధ్య రాజీ కుదుర్చేందుకు ఫ్యాన్ పార్టీ నేతలు తీవ్ర కష్టాలు పడినట్లు తెలుస్తుంది. ఓ దశలో తమ కుటుంబానికి ఇంచార్జి పదవి ఇవ్వకపోతే రాజకీయంగా ప్రత్యామ్నాయం చూసుకోవాల్సి వస్తుందని మాజీ ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవ రెడ్డి ఒకింత హెచ్చరికగానే మాట్లాడినట్టు సమాచారం. ఇటు మాజీ ఎంపీ బుట్టరేణుక కూడా ఎమ్మెల్యే టికెట్ తనకు వద్దన్నా, బలవంతంగా పోటీ చేయించి ఇలా అవమానం చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. రాబోయే ఎన్నికల్లో ఎంపీ టికెట్ ఇస్తానని స్పష్టమైన హామీ ఇవ్వాలని జగన్‌ని గట్టిగా అడిగినట్టు తెలుస్తోంది. చివరకు ఇరు వర్గాలను రాజీ చేసిన ఫ్యాన్ పార్టీ నేతలు ఎమ్మిగనూరు నియోజకవర్గం వైసీపీ ఇన్చార్జిగా ఎర్రకోట రాజు రెడ్డిని, పార్లమెంటు కోఆర్డినేటర్‌గా బుట్టా రేణుకను ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
మొత్తానికి మాజీ ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి నియోజకవర్గ ఇన్చార్జిగా తన మనవడు ఎర్రకోట రాజీవ్ రెడ్డిని నిలబెట్టే విషయంలో పక్కా స్కెచ్‌తో పంతం పట్టి సాధించుకున్నారని సెగ్మెంట్లో టాక్ నడుస్తోంది. మరోవైపు మూడున్నర ఏళ్లలో ఎన్నికలు ఉండటంతో పవర్ లేని పార్లమెంటు కోఆర్డినేటర్ పదవి ఇవ్వడం ఏంటని బుట్టా రేణుక వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఫ్యాన్ పార్టీలో బీసీ మహిళకు ఇంత అన్యాయం చేస్తారా అంటూ గుర్రుగా ఉన్నారట బుట్టా అభిమానులు.

