Delhi: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో, అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ప్రజలను ఆకర్షించేందుకు కీలక హామీలు ఇస్తోంది. ఈ క్రమంలో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సోమవారం కీలక ప్రకటన చేశారు. ఆలయాలు గురుద్వారాల్లో పనిచేసే పూజారులు, గ్రంథీలకు ప్రత్యేక పథకం ప్రకటించారు.
తాము అధికారంలోకి వచ్చిన వెంటనే పూజారులు, గ్రంథీలకు నెలకు రూ.18,000 గౌరవ వేతనం అందజేస్తామని కేజ్రీవాల్ వెల్లడించారు. “పురోహితులు, గ్రంథీలు మన ఆచార సంప్రదాయాలను భవిష్యత్ తరాలకు అందజేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే, వారి ఆర్థిక పరిస్థితిని పట్టించుకునే దిశగా ఇప్పటి వరకు ఎవరూ ముందుకు రాలేదు. వారి సేవలను గౌరవించడమే మా కర్తవ్యం.”
ఈ పథకానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ రేపటినుంచే ప్రారంభమవుతుందని ఆయన తెలిపారు. రిజిస్ట్రేషన్ ప్రారంభ కార్యక్రమం హనుమాన్ ఆలయంలో స్వయంగా తానే ప్రారంభిస్తానని చెప్పారు. అలాగే, ఈ కార్యక్రమానికి అడ్డుపడొద్దని బీజేపీని కోరారు. “రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఎవరు అడ్డంకులు సృష్టించినా, దాన్ని పాపం చేసినట్లే పరిగణిస్తాం” అని వ్యాఖ్యానించారు.
ఈ ప్రకటనతో కేజ్రీవాల్, హిందూ మరియు సిక్కు మతాల వర్గాల మద్దతు కోరుతూ కీలక రాజకీయ పోటీకి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది