CM Chandrababu: ఆంధ్రప్రదేశ్లో జిల్లాల పునర్విభజన అంశం మరోసారి ప్రధాన చర్చగా మారింది. సోమవారం సచివాలయంలో జరిగిన సమీక్ష అనంతరం, సీఎం చంద్రబాబు నేడూ మంత్రివర్గ ఉపసంఘాన్ని పిలిచి తుది నిర్ణయాలపై చర్చించనున్నారు. ఇప్పటికే మార్కాపురం, మదనపల్లెతో పాటు పోలవరం ప్రాజెక్టు పరిధిలోని రంపచోడవరం ప్రాంతానికీ జిల్లా హోదా ఇవ్వాలన్న ప్రతిపాదన పునర్విచారణ దశకు వచ్చింది.
సమావేశంలో సీఎం స్పష్టంగా చెప్పిన విషయం ఏమిటంటే—ఒక్కో మార్పు ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలి, అవసరానికి మించి సరిహద్దులను మార్చే ప్రయత్నాలు చేయకూడదు. ఈ నేపథ్యంలో అధికారులు కొత్త నివేదికను సిద్ధం చేస్తున్నారు.
రంపచోడవరం–చింతూరు ప్రాంతాల విషయానికి వస్తే, పాడేరు జిల్లాకేంద్రం నుంచి దూరం ఎక్కువగా ఉండటం, పోలవరం ముంపు ప్రాంతాల అభివృద్ధి అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని కొత్త జిల్లా ఏర్పాటు ప్రయోజనాలను సీఎం పరిశీలించారు. ఈ డివిజన్లు తూర్పుగోదావరిలో చేరితే ఆ జిల్లాలో జనాభా 24 లక్షలు దాటిపోతుందని, నియోజకవర్గాల సంఖ్య 10కి పెరిగి జిల్లా పరిమాణం అతిగా మారే అవకాశముందని అధికారులు వివరించారు. ఈ నేపథ్యంలో రంపచోడవరమే జిల్లా ప్రధాన కేంద్రంగా అనుకూలమని సీఎం అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
Also Read: Gas Cylinder: గ్యాస్ సిలిండర్ పొందాలంటే ఇది తప్పనిసరి
ఇక, విజయవాడ పరిసర ప్రాంతాల విషయానికి వస్తే పెనమలూరును పక్కన పెట్టి గన్నవరం, నూజివీడు నియోజకవర్గాలను ఎన్టీఆర్ జిల్లాలో చేర్చాలన్న ఉపసంఘం ప్రతిపాదనపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. భౌగోళిక పరిస్థితులను పట్టించుకోకుండా రాజకీయ సూచనల ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడమేమిటని ప్రశ్నించినట్లు సమాచారం. దీనిపై మళ్లీ సమగ్ర పరిశీలన చేయాలని సీఎం ఆదేశించారు.
ప్రకాశం జిల్లాకు సంబంధించి అద్దంకి, కందుకూరు నియోజకవర్గాల విలీనానికి చంద్రబాబు అనుమతి తెలిపారు. అలాగే అద్దంకి, మడకశిరలను కొత్త రెవెన్యూ డివిజన్లుగా ఏర్పాటు చేసే విషయంలో సానుకూలత చూపారు. బనగానపల్లె డివిజన్ ప్రతిపాదన ప్రస్తుతం నిలిచి ఉన్నట్లు తెలిసింది.
తిరుపతి–నెల్లూరు–చిత్తూరు జిల్లాల సరిహద్దుల విషయంలో కూడా కొన్ని మార్పులు పరిశీలనలో ఉన్నాయి. గూడూరును తిరుపతి జిల్లా నుంచి నెల్లూరులో చేర్చడం, నగరి డివిజన్ను తిరుపతి జిల్లాకు జతచేయడం వంటి ప్రతిపాదనలు మంగళవారం సమావేశంలో నిర్ణయం తీసుకోనున్న అంశాలుగా ఉన్నాయి. అన్ని అంశాలను మరొకసారి పరిశీలించిన తర్వాత, కొత్త జిల్లాలు మరియు డివిజన్లపై తుది నిర్ణయాలు నేడు వెల్లడయ్యే అవకాశముంది. రాష్ట్ర పరిపాలనా పునర్వ్యవస్థీకరణలో ఇవే కీలక మార్పులుగా నిలిచేలా కనిపిస్తోంది.

