Nara Lokesh: ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల ‘మోంథా’ తుఫాను సృష్టించిన భారీ విధ్వంసం, పంట నష్టంపై కేంద్ర ప్రభుత్వం నుంచి తక్షణ ఆర్థిక సహాయం కోరేందుకు రాష్ట్ర మంత్రులు నారా లోకేశ్ (ఐటీ, విద్యా శాఖ), వంగలపూడి అనిత (హోం శాఖ) మంగళవారం ఢిల్లీలో పర్యటిస్తున్నారు.
పార్లమెంట్‌లో ఎంపీలతో భేటీ
పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో, మంత్రులు లోకేశ్, అనిత ఉదయం ఢిల్లీకి చేరుకున్నారు. వారికి తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ఎంపీలు సాదర స్వాగతం పలికారు. అనంతరం, పార్లమెంట్‌లోని టీడీపీ పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో తమ పార్టీ ఎంపీలతో మంత్రులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై, ముఖ్యంగా తుఫాను సహాయక చర్యలు, కేంద్రం నుంచి రాబట్టాల్సిన నిధులపై కూలంకషంగా చర్చించారు.
కేంద్ర మంత్రులకు సమగ్ర నష్టాల నివేదిక
ఈ పర్యటనలో భాగంగా, మంత్రి లోకేశ్, హోంమంత్రి అనిత కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్లను కలిశారు. ‘మోంథా’ తుఫాను వల్ల రాష్ట్రంలో జరిగిన నష్టంపై ఏపీ ప్రభుత్వం రూపొందించిన సమగ్ర నివేదికను వారు కేంద్ర మంత్రులకు అందచేశారు.
ఇది కూడా చదవండి: Pawan Kalyan Controversy: పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై దుమారం.. క్షమాపణ చెప్పకపోతే ఒక్క సినిమా కూడా ఆడదు
తుఫాను కారణంగా రాష్ట్రానికి రూ.6,352 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు ఈ నివేదికలో ప్రభుత్వం స్పష్టం చేసింది. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో తక్షణ సహాయ, పునరావాస కార్యక్రమాలు చేపట్టేందుకు, అలాగే దీర్ఘకాలిక పునర్నిర్మాణానికి అవసరమైన ఆర్థిక సహాయం అందించాలని మంత్రులు కేంద్రాన్ని కోరారు.
నివేదికలోని ముఖ్యాంశాలు:
‘మోంథా’ తుఫాను ప్రభావంపై ఏపీ ప్రభుత్వం కేంద్రానికి సమర్పించిన నివేదికలో పేర్కొన్న ముఖ్యమైన అంశాలు:
-
ప్రభావం: మొత్తం 3,109 గ్రామాలు ప్రభావితమయ్యాయి. అక్టోబర్ 28 రాత్రి సుమారు గంటకు 100 కి.మీ. వేగంతో గాలులు, భారీ వర్షాలతో తుఫాను కాకినాడ సమీపంలో తీరం దాటింది.
-
సహాయక చర్యలు: 1.92 లక్షల మందిని 2,471 పునరావాస శిబిరాలకు తరలించారు. ప్రభావిత కుటుంబాలకు తక్షణ సాయం కింద రూ.3,000 చొప్పున పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణ సహాయం కోసం రూ.60 కోట్లు విడుదల చేసింది.
-
వ్యవసాయ నష్టం: వ్యవసాయ రంగానికి రూ.271 కోట్ల నష్టం వాటిల్లింది.
-
మౌలిక వసతుల నష్టం: రహదారులు, మౌలిక వసతులకు అత్యధికంగా రూ.4,324 కోట్ల నష్టం సంభవించింది. నీటిపారుదల & నీటి వనరులకు రూ.369 కోట్లు, విద్యుత్ రంగానికి రూ.41 కోట్ల నష్టం వాటిల్లింది.
-
శాశ్వత నిర్మాణాలు: శాశ్వత నిర్మాణాలకు రూ.1,302 కోట్ల నష్టం వాటిల్లగా, గృహ నష్టం రూ.7 కోట్లుగా అంచనా వేశారు.
-
NDRF నిధులు: జాతీయ విపత్తు ప్రతిస్పందన నిబంధనల (NDRF) ప్రకారం, రాష్ట్రానికి రూ.902 కోట్లు అర్హత కలిగిన నష్టంగా గుర్తించారు.
ఇప్పటికే కేంద్ర అంతర్-మంత్రిత్వ శాఖ బృందం (IMCT) క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి చేసి వెళ్లిన నేపథ్యంలో, ఈ నివేదిక ఆధారంగా తక్షణమే నిధులు విడుదల చేయాలని ఏపీ మంత్రులు నారాలోకేష్ అనిత కేంద్రాన్ని గట్టిగా కోరనున్నారు.

