Pawan Kalyan: తిరుమలలో కల్తీ నెయ్యి వాడకం వివాదం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. గత వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ ఆయన సోషల్ మీడియాలో ఒక ట్వీట్ చేశారు. భక్తుల విశ్వాసాన్ని గత ప్రభుత్వం పూర్తిగా దెబ్బతీసిందని ఆరోపించారు.
పవన్ కల్యాణ్ తన ట్వీట్లో పేర్కొంటూ —
“తిరుమల కేవలం ఒక ఆలయం కాదు… అది కోట్లాది భక్తుల ఆధ్యాత్మిక నమ్మకానికి నిలయము. మనం ప్రగాఢ విశ్వాసంతో వెళ్లే పవిత్ర స్థలంలో కల్తీ నెయ్యి వాడకం జరగడం అమానుషం. గత ప్రభుత్వ హయాంలోని టీటీడీ బోర్డు భక్తుల హృదయాలను గాయపరిచింది. వారి భక్తిని ఒక అవకాశంగా చూసి వ్యవహరించారు” అని ఆవేదన వ్యక్తం చేశారు.
అలాగే 2019 నుంచి 2024 వరకు తిరుమలను 10.97 కోట్ల మంది భక్తులు దర్శించుకున్నారని, అంటే రోజుకు సగటున 60 వేల మంది తిరుమల వచ్చారని ఆయన గుర్తుచేశారు. రాష్ట్రపతి, ప్రధానమంత్రి వంటి అత్యున్నత స్థాయి వ్యక్తులు కూడా దర్శించుకునే పవిత్ర క్షేత్రంలో నిబంధనలు ఉల్లంఘించడం తీవ్ర నిర్లక్ష్యమని పేర్కొన్నారు.
పవన్ కల్యాణ్ ఆరోపిస్తూ—
“వైసీపీ ప్రభుత్వంపై ప్రజలు ఉంచిన ఆధ్యాత్మిక నమ్మకాన్ని వారు పూర్తిగా విచ్ఛిన్నం చేశారు. గత ప్రభుత్వానికి ఒక అవకాశం ఇవ్వడం ద్వారా ప్రతి భక్తుడు మోసపోయాడు” అని విమర్శించారు.
తిరుమలలో కల్తీ నెయ్యి వ్యవహారంపై తగిన చర్యలు చేపట్టాలని, భక్తుల విశ్వాసం పునరుద్ధరించడానికి ప్రభుత్వం కఠినమైన సంస్కరణలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

