PM Modi: అహ్మదాబాద్ నగరం ఒక తీవ్ర విషాదంతో దిగ్భ్రాంతికి గురైంది. గురువారం (జూన్ 12, 2025) అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ విమానాశ్రయం సమీపంలో లండన్‌కు బయలుదేరిన ఎయిర్ ఇండియా బోయింగ్ విమానం కుప్పకూలిపోయింది. ఈ దుర్ఘటనలో విమానంలో ఉన్నవారితో పాటు, అది కూలిన భవనంలో ఉన్నవారు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది.
ఈ ఘోర ప్రమాదంలో భారీ సంఖ్యలో ప్రాణనష్టం సంభవించింది. విమానంలో మొత్తం 230 మంది ప్రయాణికులు, 10 మంది సిబ్బంది, ఇద్దరు పైలెట్లు సహా మొత్తం 242 మంది ఉన్నారు. వీరిలో విమానంలో ఉన్న 241 మంది ప్రయాణికులు, సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. విమానం కూలిన తీవ్రతకు, మంటల ధాటికి మృతదేహాలు పూర్తిగా కాలిపోయి గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాయి. ఈ కారణంగా, మృతదేహాలను గుర్తించడానికి డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. వీలైనంత త్వరగా అన్ని మృతదేహాలకు డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
Also Read: Iran-Israel: యుద్ధ వాతావరణం: ఇరాన్, ఇజ్రాయెల్‌లోని భారతీయులకు కీలక అడ్వైజరీ
ప్రధాని మోదీ పర్యటన, ఉన్నతాధికారుల సమీక్ష:
ఈ ప్రమాదం జరిగిన వెంటనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంపై ఆందోళన చెందుతున్న ప్రధాని, శుక్రవారం (జూన్ 13, 2025) స్వయంగా అహ్మదాబాద్‌లో పర్యటించి ప్రమాద స్థలాన్ని పరిశీలించనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇప్పటికే అహ్మదాబాద్‌కు చేరుకున్నారు. ఆయన అక్కడున్న అధికారులతో సమావేశమై ప్రమాదానికి గల కారణాలు, సహాయక చర్యల పురోగతిపై ఆరా తీశారు. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు, సాంకేతిక లోపాలు వంటి అంశాలపై సమగ్ర విచారణ జరిగే అవకాశం ఉంది. ఈ విషాద ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

