Abhishek Bachchan: బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ తన అనుమతి లేకుండా ఫొటోలు, వీడియోలు, ఏఐ (AI) ద్వారా సృష్టించిన తన ఫొటోలను వాణిజ్య, అశ్లీల ప్రయోజనాలకు వాడుకుంటున్నారని ఆరోపిస్తూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన పబ్లిసిటీ, పర్సనాలిటీ హక్కులను కాపాడాలని ఆయన న్యాయస్థానాన్ని కోరారు.
అభిషేక్ బచ్చన్ తరఫు న్యాయవాది ప్రవీణ్ కోర్టుకు ఇచ్చిన సమాచారం ప్రకారం, కొన్ని వెబ్‌సైట్‌లు, వ్యక్తులు ఏఐ టెక్నాలజీని ఉపయోగించి నటుడి ఫొటోలను రూపొందించి, వాటిని అశ్లీల కంటెంట్ కోసం విచ్చలవిడిగా వాడుతున్నారు. దీని వల్ల అభిషేక్ బచ్చన్ ప్రతిష్టకు భంగం కలుగుతోందని, ఈ అక్రమ వినియోగాన్ని నిలిపివేయాలని ఆయన అభ్యర్థించారు. తన వ్యక్తిగత జీవితం కుటుంబానికి ఇబ్బందులు కలుగుతున్నాయని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు.
Also Read: Deepika Padukone: దువా బర్త్‌డే స్పెషల్: కూతురి కోసం స్వయంగా కేక్ చేసిన దీపికా పదుకొనే
ఈ మధ్యకాలంలో, ఏఐ టెక్నాలజీతో సృష్టించిన నకిలీ ఫొటోలు, వీడియోలు సెలబ్రిటీలకు పెద్ద సమస్యగా మారాయి. ఇప్పటికే చాలామంది ప్రముఖులు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. ఇదే తరహా సమస్యపై గతంలో అభిషేక్ బచ్చన్ భార్య, నటి ఐశ్వర్య రాయ్ బచ్చన్ కూడా ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆమె తన అనుమతి లేకుండా తన పేరు, ఫొటోలు, కూతురి ఫొటోలను వాడకుండా నిలిపివేయాలని కోరారు. అప్పుడు కోర్టు ఐశ్వర్యకు అనుకూలంగా తాత్కాలిక ఉత్తర్వులు కూడా జారీ చేసింది.
అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ ఇద్దరూ ఒకే సమస్యపై ఒకే కోర్టును ఆశ్రయించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇది సెలబ్రిటీల వ్యక్తిగత హక్కుల పరిరక్షణ ఎంత ముఖ్యమో మరోసారి తెలియజేసింది. కోర్టు ఈ పిటిషన్‌పై విచారణ జరిపి, తదుపరి ఉత్తర్వులు జారీ చేయనుంది.

