Quantum Valley: అమరావతి రాజధానిలో క్వాంటం టెక్నాలజీ రంగ అభివృద్ధికి ప్రభుత్వం కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. మొత్తం 50 ఎకరాల భూమిని క్వాంటం వ్యాలీ కోసం కేటాయించగా, అందులో రెండు ఎకరాల్లో అమరావతి క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ నిర్మించేందుకు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. సీఆర్డీఏ కార్యాలయానికి సమీపంలోని సీడ్ యాక్సెస్ రోడ్ పక్కన శాశ్వత భవన నిర్మాణానికి భూమి కేటాయింపును పూర్తి చేశారు.
ఈ భవన నిర్మాణానికి అవసరమైన టెండర్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. టెండర్ల దాఖలు గడువు ఈ నెల 6న ముగియనుంది. శాశ్వత భవనం పూర్తయ్యే వరకు, రాజధాని పరిధిలోని విట్ యూనివర్శిటీలో తాత్కాలిక క్వాంటం సెంటర్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అనంతరం దీనిని రాయపూడిలో నిర్మిస్తున్న శాశ్వత భవనానికి తరలించనున్నారు.
Also Read: Bihar Assembly Speaker: బిహార్ అసెంబ్లీ స్పీకర్‌గా ప్రేమ్ కుమార్ ఎన్నిక
క్వాంటం భవనం గ్రీన్ బిల్డింగ్ మోడల్లో Z+1 డిజైన్‌తో నిర్మించనున్నారు. మొత్తం 4,201 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ భవనం వచ్చేలా నమూనా సిద్ధమైంది. గ్రౌండ్ ఫ్లోర్ 1,990 చద.మీ., ఫస్ట్ ఫ్లోర్ 1,996 చద.మీ., బేస్మెంట్ 210 చద.మీ. అదనంగా 109 చద.మీ. హెడ్‌రూమ్, 130 చద.మీ. డెక్ ఏరియా ఉండనుంది.
ఈ మెగా ప్రాజెక్ట్‌లో టిసిఎస్ సాంకేతిక భాగస్వామిగా పనిచేయనుంది. ఎల్ అండ్ టీ నిర్మాణ పనుల బాధ్యతను తీసుకోనుంది. బిఎమ్ కూడా 150-క్యూబిట్ సామర్థ్యంగల క్వాంటం కంప్యూటర్ స్థాపనకు ముందుకు వచ్చింది. మూడు సంస్థలతో ప్రభుత్వం ఇప్పటికే ఒప్పందాలు పూర్తి చేసింది. ప్రాజెక్ట్ నిర్మాణ వ్యయాన్ని సీఆర్డీఏ, ఐటీ అండ్ ఈ శాఖలు కలిసి భరించనున్నాయి.
క్వాంటం టెక్నాలజీ రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఇటీవలే ప్రత్యేక క్వాంటం టెక్నాలజీ పాలసీని విడుదల చేసింది. అమరావతిని జాతీయ స్థాయి క్వాంటం ఇన్నోవేషన్ హబ్‌గా మార్చాలన్న లక్ష్యంతోనే ఈ క్వాంటం వ్యాలీ ప్రాజెక్ట్‌ను వేగంగా ముందుకు తీసుకువెళ్తోంది.

