Delhi Horror

Delhi Horror: బర్త్ డే రోజే.. హత్య.. కాల్పులు జరిపి పారిపోయిన దుండగులు

Delhi Horror: దేశ రాజధాని ఢిల్లీలో పెరుగుతున్న ‘గన్ కల్చర్’ (తుపాకీ సంస్కృతి) ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా యువత లక్ష్యంగా జరుగుతున్న వరుస కాల్పుల ఘటనలు భద్రతా పరిస్థితిని ప్రశ్నిస్తున్నాయి. తాజాగా, తన పుట్టినరోజునే ఓ యువకుడు దుండగుల కాల్పులకు బలయ్యాడు. ఢిల్లీలోని షాదారా ప్రాంతంలో 27 ఏళ్ల గగన్ అనే యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు.

బర్త్ డే వేడుకల ముందు విషాదం

వివరాల్లోకి వెళ్తే… షాబాద్‌కు చెందిన గగన్ తన 27వ పుట్టినరోజు సందర్భంగా స్నేహితులను కలిసేందుకు బయలుదేరాడు. కేక్ కట్ చేయడానికి కొద్ది నిమిషాల ముందు, దుండగులు అతనిపై కాల్పులు జరిపారు. గగన్ తలకు బుల్లెట్ తగలడంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే స్నేహితులు అతడిని ఆస్పత్రికి తరలించగా, అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. పుట్టినరోజు వేడుకల ముందు తమ స్నేహితుడు దారుణంగా హత్యకు గురికావడంతో గగన్ కుటుంబ సభ్యులు, స్నేహితులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

స్నేహితుల మధ్య వివాదమే కారణమా?

గగన్ హత్యకు వెనుక కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రాథమిక అనుమానాల ప్రకారం, ఈ హత్యకు స్నేహితుల మధ్య ఉన్న పాత వివాదం కారణమై ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Kishan Reddy: వందేభారత్‌ రైలులో వరంగల్‌కు కిషన్‌ రెడ్డి.. రైల్వే అభివృద్ధి పనుల పరిశీలన

గత మూడు నెలల్లో పది కాల్పుల ఘటనలు

గగన్ హత్య ఒక్కటి మాత్రమే కాదు, గడిచిన మూడు నెలల కాలంలో ఢిల్లీలో ఇలాంటి కాల్పుల ఘటనలు దాదాపు పది వరకు జరగడం భద్రతా వైఫల్యాన్ని ఎత్తి చూపుతోంది. ఇదే తూర్పు ఢిల్లీలోని షాదారా ప్రాంతంలో ఓ యువకుడిపై అతని సొంత సోదరులే కాల్పులు జరిపారు.

భార్యతో కలిసి బయటికి వెళ్లిన 22 ఏళ్ల ఆదిత్ అనే యువకుడిపై కాల్పులు జరిగాయి, అతడు తీవ్రంగా గాయపడ్డాడు. ఢిల్లీలోని పటేల్ నగర్ ప్రాంతంలో కూడా కాల్పుల ఘటన నమోదైంది.రాజధాని నడిబొడ్డున బహిరంగంగా వరుసగా జరుగుతున్న ఈ కాల్పుల ఘటనలు శాంతిభద్రతల పరిస్థితిపై ఆందోళనలను పెంచుతున్నాయి. ఢిల్లీలో నేరాలు, ముఖ్యంగా ఆయుధాల వినియోగం పెరగడంపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని పౌరులు డిమాండ్ చేస్తున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *